చిత్తూరు ఎమ్మెల్యే డి.ఎ.సత్యప్రభ ఇంటిపై

చిత్తూరు ఎమ్మెల్యే డి.ఎ.సత్యప్రభ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. రెండు రోజులుగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కింగ్‌ఫిషర్‌ సంస్థతో పాటు పలు పరిశ్రమలను నడుపుతున్నారు డి.ఎ.సత్యప్రభ తనయుడు డి.కె.శ్రీనివాసులు. 

సత్యప్రభ భర్త ఆదికేశవుల నాయుడు మాజీ ఎంపి, టిటిడి మాజీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన మరణానంతరం పరిశ్రమలన్నింటినీ ఆయన కుమారుడే చూసుకుంటున్నారు. గతంలో డి.కె.ఆదికేశవులనాయుడు ప్రముఖ పారిశ్రామికవేత్త విజయమాల్యాతో కలిసి కింగ్‌ఫిషర్‌ మరికొన్ని సంస్థలలో పార్టనర్స్‌గా ఉన్నారు. వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి మాల్యా పరారైన విషయం తెలిసిందే. 


విజయమాల్యా తరువాత కింగ్‌ ఫిషర్‌ను నేరుగా డి.కె.శ్రీనివాసులు కొనుగోలు చేసి నడుపుతున్నారు. విజయమాల్యాతో గతంలో ఉన్న పార్టనర్‌షిప్‌ కారణంగానే ఐటి శాఖ అధికారులు దాడులు నిర్వహించారా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. అయితే ఒక్కసారిగా డి.కె.సత్యప్రభ ఇంటిపై ఐటి అధికారులు దాడులు చేయడంపై టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒక ప్రజాప్రతినిధిని గంటల తరబడి విచారణ పేరుతో ఐటీ అధికారులు ఇబ్బందులకు గురిచేయడంపై మండిపడ్డారు. అయితే ఐటీ శాఖ అధికారులు మాత్రం 30 సంవత్సరాల పాటు డి.కె.కుటుంబం మొత్తం నడుపుతున్న పరిశ్రమలకు సంబంధించిన లెక్కలను, ఐటీ రిటర్న్‌ను ఈనెల 30వ తేదీలోగా అందించాలని చెప్పి వెళ్ళిపోయారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*