అమ్మాయి మెసేజ్ రెండు గ్రామాలు కొట్టుకునేలా చేసింది

wp-1478525115470.jpg

విల్లిపురం : సరదా పనులు చేసేటపుడు జాగ్రత్తగా ఆలోచించాలి. పెంకితనంతో ఆలోచన వచ్చిందే తడవుగా అమలు చేయకూడదు. పోలీసులు తెలిపిన ఈ సంఘటన వివరాలను తెలుసుకుంటే ఆ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది.

పదిహేనేళ్ళ అమ్మాయి తన పొరుగింట్లో ఉన్న నలభయ్యేళ్ళ మహిళ మొబైల్‌ను దుర్వినియోగం చేసింది. 20 ఏళ్ళ వయసున్న తన బంధువు గోపీనాథ్‌కు సరదాగా ఓ మెసేజ్ పంపించాలనుకుంది. అందుకోసం ఆ మహిళ మొబైల్‌ను ఉపయోగించి ‘ఐ లవ్ యూ’ అని మెసేజ్ పంపించింది.

ఆ మెసేజ్‌కు స్పందించిన గోపీనాథ్ ఆ మహిళకు ఫోన్ చేశాడు. ఆ మెసేజ్ తన మొబైల్ నుంచి వచ్చినప్పటికీ ఎవరు పంపించారో తనకు తెలియదని ఆ మహిళ చెప్పినప్పటికీ గోపీనాథ్ వినిపించుకోలేదు. పదే పదే ఫోన్ చేశాడు. చివరికి గట్టిగా అరచి చెప్పినప్పటికీ మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి, అసభ్యకరంగా మాట్లాడాడు. విసిగిపోయిన ఆ మహిళ తన సమీప బంధువు అయ్యప్పన్‌ (18)కు ఈ సంఘటన గురించి వివరించింది. అయ్యప్పన్ గోపీనాథ్‌ను హెచ్చరించాడు.

గోపీనాథ్ అప్పటికీ వినిపించుకోకపోవడంతో నలుగురు మిత్రులను తీసుకుని గోపీనాథ్ ఉంటున్న మున్నియన్‌పెట్టయ్‌కి వెళ్ళాడు. అక్కడి స్థానిక పెద్దలు వారికి నచ్చజెప్పి, గోపీనాథ్‌కు బుద్ధి చెబుతామని హామీ ఇచ్చారు. కానీ గోపీనాథ్ తనకు అవమానం జరిగిందని భావించాడు. ఐదుగురు మిత్రులతో కలిసి అయ్యప్పన్ బృందాన్ని వెంటాడాడు. ఇరు వర్గాలు కర్రలు, రాళ్ళతో కొట్టుకున్నారు. అయ్యప్పన్‌కు గాయాలవడంతో పాండిచేరి వైద్య శాస్త్రాల సంస్థలో చేర్పించి, చికిత్స చేయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అతని గ్రామస్థులు 10 మంది మున్నియన్‌పెట్టయ్‌ వెళ్ళారు. గోపీనాథ్‌పై దాడి చేయబోయారు. కానీ గోపీనాథ్ గ్రామస్థులు అతనికే మద్దతిగా నిలిచి, ప్రత్యర్థి బృందంపై దాడికి పాల్పడ్డారు.

ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన వచ్చి, ఇరు వర్గాలను శాంతింపజేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను మోహరించారు.