ntr

నందమూరి బాలకృష్ణ, యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌ల మధ్య విభేదాలున్నాయని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. చాలాకాలం నుంచి వారిద్దరూ కలిసిన సందర్భాలే లేకపోవడం.. ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. నిజానికి.. ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయో లేవో తెలీదు కానీ, అన్యోన్యత మాత్రం ఇంకా ఉందని చెప్పడానికి తాజాగా ఎన్టీఆర్ చేసిన కామెంట్సే నిదర్శనం. తన బాబాయ్ బాలయ్య నటిస్తున్న ప్రతిష్టాత్మక వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి సంబంధించి రీసెంట్‌గా విడదలైన టీజర్‌పై అతను అదిరిపోయే వ్యాఖ్యలు చేశాడని సమాచారం.

ఈ టీజర్ ఎంతో అద్భుతంగా ఉందని, ముఖ్యంగా బాబాయ్ గెటప్ అదిరిపోయిందని, ‘శాతకర్ణి’గా బాలయ్య అచ్చుగుద్దినట్టుగా ఆ చక్రవర్తిలానే ఉన్నాడని ఎన్టీఆర్ తన సన్నిహితులతో చెప్పుకున్నాడట. అంతేకాదు.. ఈ వయసులో పనిపట్ల బాబాయ్ చూపిస్తున్న డెడికేషన్ తననెంతో చలింపచేస్తోందని, ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని తాను ఆశగా ఎదురుచూస్తున్నానని చెప్పినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు క్రిష్ మీద కూడా ఎన్టీఆర్ ప్రశంసల వర్షం కురిపించాడట. సబ్జెక్ట్‌ని డీల్ చేయడంలో క్రిష్‌కి బాగా తెలుసని, రాజమౌళి తర్వాత అలాంటి టాలెంట్ ఉన్న తెలుగు దర్శకుల్లో క్రిష్ కూడా ఒకరని పొగడ్తలతో ముంచెత్తాడట ఎన్టీఆర్.

ఈ విధంగా ‘శాతకర్ణి’ టీజర్‌పై ఎన్టీఆర్ కామెంట్స్ చేయడంతో.. ఈ వార్త ఇండస్ట్రీలో ప్రాధాన్యతని సంతరించుకుంది. అటు.. ఎన్టీఆర్ ‘శాతకర్ణి’ టీజర్‌పై ఎలా స్పందిస్తాడా? అని ఎదురుచూస్తూ వచ్చిన నందమూరి ఫ్యాన్స్ సైతం అతని కామెంట్స్ విని సంతోషంలో మునిగి తేలుతున్నట్లు తెలుస్తోంది.

Category:

Telugu Movies news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*