wp-1479353084826.jpg
పెద్ద నోట్లు రద్దు చేస్తూ మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయం దేశంలో అనేక సంచలనాలకు కారణమవుతోంది. రద్దు దెబ్బతో మరుగున పడిపోయిన వేల ఏళ్లనాటి పద్ధతులు తెరపైకి వస్తున్నాయి. చరిత్ర పుస్తకాల్లో చదువుకోవడం, పెద్దలు చెబితే వినడం తప్ప తెలియని పురాతన పద్ధతులను జనం మళ్లీ ఇప్పుడు కనులారా చూస్తున్నారు. ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. నోట్ల రద్దుతో చేతిలో డబ్బులు లేక దేశవ్యాప్తంగా సామాన్యులు కొంత ఇబ్బంది పడుతున్నారు. అయితే రద్దు వెనక ఉన్న ఉద్దేశం మంచిది కావడంతో జనాలు సహనం వహిస్తున్నారు. డబ్బులు మార్చుకునేందుకు క్యూలలో గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.

దేశం మొత్తం నోట్ల మార్పిడి కోసం, డబ్బులు డ్రా చేసుకునేందుకు క్యూలో నిల్చుంటుంటే జార్ఖండ్, ఒడిశాలోని కొన్ని గ్రామాలు వినూత్న ఆలోచనతో ముందుకెళ్తున్నాయి. అక్కడ నోట్ల రద్దు ప్రభావం ఇసుమంతైనా కనిపించడం లేదు. ఎవరూ ఇబ్బందులు పడడం లేదు. ఇందుకు కారణం వారి వినూత్న అలోచన. ఎప్పుడో వేల ఏళ్ల క్రితం నాటి వస్తుమార్పిడి పద్ధతితో వారు ప్రస్తుత సంక్షోభం నుంచి సులభంగా బయటపడ్డారు. తమ వద్ద ఉన్న వస్తువులను ఎదుటి వారికి ఇచ్చి వారి వద్ద ఉన్న తమకు కావాల్సిన వస్తువులను తీసుకుంటూ ఒకరి కొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వీరికి స్థానిక కిరాణాషాపుల యజమానులు మరింత సహకారం అందిస్తున్నారు. అంతేకాదు డబ్బులు చేతికొచ్చాక తీసుకుంటామంటూ ప్రజలకు ఇబ్బంది లేకుండా కావలసినన్ని సరుకులు ఇస్తున్నారు. ‘‘ప్రజలకు అవసరమైన సరుకులను కిరాణాషాపులవారు ఇస్తున్నారు. ప్రజల వద్ద వారి డబ్బులు భద్రంగా ఉంటాయని వారు నమ్ముతున్నారు’’ అని జార్ఖండ్‌లోని బనారీ గ్రామ మాజీ పెద్ద ప్రదీప్ ఒరావోన్ అన్నారు. కొందరు వస్తుమార్పిడి పద్ధతిని ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ‘‘మా కూరగాయలను మార్కెట్‌కు వెళ్లి అమ్ముకోవడం మానేశాం. వాటిని కిరాణాషాపు వారికి ఇచ్చి మాకు కావాల్సిన ఉప్పు, పప్పు, నూనెలు తీసుకుంటున్నాం’’ అని బొరేయా గ్రామానికి చెందిన దిను మహతో తెలిపారు.

ఒడిశాలోని కొన్ని గ్రామాల్లోనూ ప్రజలు ఇటువంటి పద్ధతినే ఉపయోగించుకుంటూ సహకరించుకుంటున్నారు. చేపలు కావాలనుకుంటున్న వారు మూడు కిలోల కాలిఫ్లవర్లు ఇచ్చి కిలో చేపలు తీసుకుంటున్నారు. ఇలాగే అన్ని విషయాల్లోనూ. తమ వద్ద ఉన్న వాటిని ఇచ్చి వారికి కావాల్సినవి ఇచ్చి ముందుకు వెళ్తున్నారు. మరో గ్రామంలో అయితే ‘‘ఇప్పుడు కొనుక్కోండి.. తర్వాత డబ్బులివ్వండి’’ అనే పద్ధతి నడుస్తోంది. ‘‘ప్రస్తుతం సంక్షోభం ఉన్నమాట వాస్తవం. అందుకే దుకాణాల యజమాలు కూడా సహకరిస్తున్నారు. అరువు పద్ధతిలో సరుకులు ఇస్తున్నారు’’ అని బలంగిర్ జిల్లాలోని కంఠబంజి టౌన్‌షిప్‌కు చెందిన సురత బెహరా తెలిపారు. అంతేకాదు నోట్ల మార్పిడి కోసం గ్రామస్తులు అందరూ బ్యాంకులకు వెళ్లకుండా అందరి డబ్బులు ఒకరికే ఇచ్చి బ్యాంకుకు పంపిస్తున్నారు. ఇది నమ్మకంతో కూడుకున్న పని అయినా తమకేమీ ఇబ్బంది లేదని గ్రామస్తులు చెబుతున్నారు. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు కావాల్సిన దుస్తులను కూడా ఇక్కడి దుకాణదారులు అరువుపై ఇస్తున్నారు. ఇలా ఇవ్వడంలో తమకెటువంటి ఇబ్బందీ లేదని, నిజానికి వారివల్లే తమ వ్యాపారాలు సాగుతున్నాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరికొకరు సహకరించుకోవడం తప్ప చేసేదేమీ లేదని ఆయన పేర్కొన్నారు.

Category:

Interesting news