సెలబ్రిటీల జీవితంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే కుతూహలం చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా వాళ్ల లవ్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉంటారు. ఈ మధ్యకాలంలో తెలుగు పరిశ్రమలో అలా ఆసక్తిగా నిలిచిన జంట నాగచైతన్య, సమంత. వీళ్లిద్దరూ లవ్‌లో పడ్డారనే వార్త వచ్చినప్పట్నుంచీ రకరకాల వార్తలు వస్తున్నాయి. ‘అవును.. మేం లవ్‌లో ఉన్నాం’ అని బహిరంగంగా చెప్పినా, ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పడలేదు. ‘పెళ్లెప్పుడు’ అనే చర్చ జరుగుతోంది. దానికి ఇంకా టైమ్ ఉందని చెప్పేశారు.

 
 ఆ సంగతలా ఉంచితే.. అసలు వీళ్లిద్దరూ ఎప్పుడు లవ్‌లో పడ్డారబ్బా? అనే చర్చ జరుగుతోంది. ఇదే విషయం గురించి ఓ తాజా ఇంటర్వ్యూలో సమంత కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. మొదట్లో మంచి స్నేహితుల్లా ఉండేవాళ్లమనీ, ఆ తర్వాత అది ప్రేమగా మారిందనీ సమంత పేర్కొన్నారు. ఎప్పుడు లవ్‌గా టర్న్ అయిందనే విషయం మాత్రం ఆమె స్పష్టంగా చెప్పలేదు.
 
 అయితే, ముందు నుంచీ నాగచైతన్యతో తన లవ్ గురించి క్లూ ఇస్తూ వచ్చానని, ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదనీ సమంత పేర్కొనడం విశేషం. ఆ విషయం గురించి సమంత మాట్లాడుతూ – ‘‘నా మొదటి సినిమా ‘ఏ మాయ చేసావె’ అప్పట్నుంచీ మా గురించి ‘హింట్’ ఇస్తూ వస్తున్నాను. కానీ, ఎవరూ ఆ విషయాన్ని గ్రహించలేదు.
 
 మొదట్లో నేను ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ‘మీతో కలసి యాక్ట్ చేసిన హీరోల గురించి వన్ వర్డ్‌లో చెప్పండి’ అని రిపోర్టర్లు అడిగితే, నాగచైతన్య గురించి చెప్పేటప్పుడు ‘ఫస్ట్ లవ్’ అనేదాన్ని. ఆ క్లూని ఎవరూ పట్టుకోలేకపోయారు. నా జీవితంలో నాగచైతన్య ముఖ్యమైన వ్యక్తి. ఇండస్ట్రీలో నా మొదటి స్నేహితుడు తనే. ఎప్పటికీ తను నాకు బెస్ట్ ఫ్రెండే. ఇండస్ట్రీలో ఒకటిగా ఎదిగాం. ఒకవేళ మేమిద్దరం కలసి ఉండలేకపోతే.. ఇక ఎవరితోనూ ఉండలేం అనిపించింది. దాంతో ఒక నిర్ణయానికి వచ్చేశాం’’ అని పేర్కొన్నారు.