వచ్చే ఏడాది మార్చి తర్వాత బ్యాంకాక్ వెళితే.. అక్కడ మీకో బాహుబలి కనిపిస్తే ఆశ్చర్యపోకండి. ఎందుకంటే.. ప్రతిష్టాత్మక టుస్సాడ్ మ్యూజియంలో బాహుబలి ప్రభాస్ మైనపు బొమ్మను ఉంచనున్నారు. 2017 మార్చిలో బ్యాంకాంక్‌లోని టుస్సాడ్ మ్యూజియంలో బాహుబలి కొలవు తీరనున్నాడు. దిగ్గజాలకు మాత్రమే చోటు దక్కే ఈ మ్యూజియంలో చోటు దక్కించుకోనున్న తొలి తెలుగు నటుడు ప్రభాస్ కావడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రధాని నరేంద్ర మోదీ మైనపు బొమ్మను ఈ మ్యూజియంలో ఉంచారు. బ్యాంకాక్ టుస్సాడ్ మ్యూజియంలో చోటు దక్కనున్న మూడో భారతీయుడు ప్రభాస్ కావడం విశేషం. బాహుబలి సినిమా విడుదల కావడంతో గూగుల్లో ప్రభాస్ గురించి ఎక్కువ మంది వెతికారు. ఈ మూవీతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.

మ్యూజియంలో ప్రభాస్ మైనపు బొమ్మ ఉంచడం కోసం టుస్సాడ్ మ్యూజియం ఆర్టిస్టులు హైదరాబాద్ వచ్చి ప్రభాస్ కొలతలు, 350 ఫొటోలను తీసుకున్నారు. బాహుబలి చిత్రంలో అమరేంద్ర బాహుబలి రూపంలో ప్రభాస్ బ్యాంకాక్‌ టుస్సాడ్ మ్యూజియంలో కనిపించనున్నాడు. ఈ మ్యూజియంలో తన మైనపు బొమ్మను ఉంచనుండటం పట్ల ప్రభాస్ ఆనందం వ్యక్తం చేశాడు. అభిమానుల వల్లే తనకు ఈ అవకాశం లభించిందన్నాడు. ఈ సందర్భంగా బాహుబలి సినిమాలో నటించే అవకాశం కల్పించిన రాజమౌళికి ధన్యవాదాలు తెలిపాడు.