isam
సినిమా పేరు: ఇజం
తారాగణం : కల్యాణ రామ్, అదితి ఆర్య, పోసాని కృష్ణ మురళి, గొల్లపూడి మారుతీరావు, జగపతిబాబు, తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
నిర్మాత: కల్యాణ్‌ రామ్‌
మాటలు.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం: పూరి జగన్నాథ్‌
విడుదల తేదీ : 21-10-2016
పాయింట్ : జర్నలిజానికి జాతీయవాదం తోడైతే ఈ ‘ఇజం’.. నల్ల కుబేరుల ఆటకట్టించే ఇజం.

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ చాలా గ్యాప్ తర్వాత సూపర్ హిట్ కోసం తీసిన సినిమా ”ఇజం”. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమాకు ప్రీ రిలీజ్ సమయంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటిస్తూ.. నిర్మించిన ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం..

కథలోకి వెళ్తే.. స్ట్రీట్ ఫైటర్ అయిన కల్యాణ్ రామ్.. బ్యాంకాక్‌లోని ఓ దీవిలో డబ్బు కోసం ఫైట్స్ చేస్తుంటాడు. కష్టపడకుండా డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు. సరిగ్గా అప్పుడే అలియా (అదితి ఆర్య)ని చూసి మనసు పడతాడు. ఆమె డాన్ అయిన జావేద్‌ భాయ్‌ (జగపతిబాబు) కుమార్తె అని తెలుసుకుంటాడు. దేశాన్ని తన తండ్రి భయపెట్టిస్తుంటే.. తన తండ్రిని భయపెట్టే వాడిని పెళ్ళి చేసుకోవాలని అదితి ఆర్య అనుకుంటుంది. ఆ లక్షణాలు చూసే కల్యాణ్‌రామ్‌ని ప్రేమిస్తుంది. అయితే కల్యాణ్‌రామ్‌ అసలు పేరు సత్య మార్తాండ్‌ అని.. తన తండ్రి భాగోతాన్ని బయటపెట్టడానికి వచ్చిన ఓ జర్నలిస్ట్‌ అని తెలుస్తుంది.

సత్య మార్తాండ్ అనే వ్యక్తి వికీలీక్స్ వంటి ఓ వెబ్ సైట్‌ గ్రాండ్ పార్టీ పేరిట పెడతాడు. ఆ వెబ్ సైట్ ద్వారా సమాజంలో ఉండే అవినీతిదారుల బండారాన్ని బయటపెడతాడు. తన తండ్రి తనికెళ్ల భరణికి జరిగిన అన్యాయానికి చిన్నప్పుడు ఎదిరించలేకపోయిన కల్యాణ్ రామ్.. పెద్దయ్యాక జర్నలిస్టుగా మారి సమాజంలోని అవినీతి నల్ల దొరలను పట్టించేందుకు ప్రయత్నిస్తుంటాడు.

ఇలా దేశంలోని నల్లధనాన్ని దుబాయ్‌లోని బ్యాంకులో భద్రపరుస్తూ… ఓ చీకటి సామ్రాజ్యానికి జావేద్ భాయ్ అధిపతిగా వ్యవహరిస్తాడు. అయితే స్ట్రీట్ ఫైటర్‌ ముసుగులో కల్యాణ్ రామ్ జావేద్ బ్యాంక్ ధనాన్ని దేశానికి తెప్పించి.. ఆ ధనాన్ని ప్రతి రైతు బ్యాంకులో జమయ్యేలా చేసేందుకు ఓ టీమ్‌తో కలిసి పనిచేస్తాడు. ఆ ప్లాన్‌లో ఇజం సక్సెస్ అవుతాడా? అలియా ప్రేమను అడ్డుపెట్టుకుని జావేద్ భాయ్‌ని పోలీసులు అప్పగిస్తాడా..? జర్నలిజం గొప్పతనాన్ని సత్య ఎలా చాటి చెప్పాడు? అనేది వెండితెర మీద చూడాల్సిందే.

విశ్లేషణ: జర్నలిజం విలువలకు అద్దం పట్టే సినిమా ఇది. జర్నలిజం అనే వృత్తికున్న విలువలతో పాటు జర్నలిజం సమాజంలోని చీకటికోణాన్ని బయటికి తీసేందుకు ఎలా ఉపయోగపడుతుందనేది ఇజం ద్వారా పూరీ సమాజానికి ఎత్తిచూపారు. జర్నలిజం ద్వారా దేశభక్తిని ఎలా చాటుకోవాలో జర్నలిజం ఎలా ఉండాలి? ప్రస్తుత సమాజానికి జర్నలిజం ఎలా ఉపయోగపడాలో అనేది సందేశాత్మకంగా పూరీ జగన్నాథ్ ఇజం ద్వారా చెప్పారు.

పాటల్లో శ్రీశ్రీ కవితలను చొప్పించారు. క్లాస్ మాస్ అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా పూరీ సందేశాత్మకంగా ఇజంను రూపొందించాడు. గతంలో ఎన్టీఆర్ ద్వారా టెంపర్‌ను పూరీ తెరకెక్కించాడు. ఈ సినిమాను మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ప్రస్తుతం సమాజానికి ఉపయోగపడే జర్నలిజం ఎలా వ్యవహరించాలో చూపించాడు.

ఇకపోతే పూర్తిగా కమర్షియల్ హంగులతో ఈ సినిమా తెరకెక్కింది. సీరియస్ కాన్సెప్ట్‌ ద్వారా కామెడీ అంతగా ఉండదు. వికీలీక్స్‌ లాంటి బలమైన నెట్‌వర్క్‌ని స్థాపించి.. విదేశాల్లో నలధనం దాచుకొంటున్న ‘నల్ల దొరల’ గుట్టురట్టు చేసి.. ఆ డబ్బుని పేద ప్రజలకు పంచి పెట్టే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఇలాంటి కథలు సామాన్య ప్రేక్షకుడికి ఈజీగా కనెక్ట్‌ అయిపోతాయి. పాయింట్‌ను పది నిమిషాలే చూపినా.. కథను ఫస్ట్ హాఫ్, సెకండాఫ్ పూర్తిగా బోర్ కొట్టకుండా నడిపించాడు.

సినిమా ప్రారంభానికి ముందే.. కల్యాణ్‌రామ్‌ ఓ జర్నలిస్ట్‌ అనే హింట్‌ ప్రేక్షకులకు దొరికేస్తుంది. కోర్టు సీన్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. దర్శకుడి ఉద్దేశం గొప్పగా ఉన్నా.. ఆ విషయాన్ని ఆసక్తికరంగా చెప్పటంలో తడబాటు కనిపిస్తుంది. హీరోయిన్ పాత్ర మేరకే నటించింది.

ఎవరెలా చేశారంటే: గత సినిమాల్లో కల్యాణ్‌ రామ్‌కు ఇందులో పాత్రకు తేడా స్పష్టంగా కనిపిస్తుంది. యాక్షన్, సెంటిమెంట్, లవ్‌‌ను కల్యాణ్ రామ్ బాగా పండించాడు. కోర్టు సన్నివేశాన్ని అదరగొట్టాడు. అదితి ఆర్యకి ఇదే తొలి సినిమా. ఆమె ఓకే. జగపతిబాబుని విలన్‌ అనుకోవడానికి వీల్లేదు. బీడీ ప్రేమికుడిగా.. కొన్ని సన్నివేశాల్లో రక్తి కట్టించాడు.

అయితే డాన్‌ పాత్రపై మరింత దృష్టి పెట్టాల్సింది. గొల్లపూడి కనిపించేది ఒక్క సన్నివేశమైనా బాగుంది. అనూప్‌ బాణీల్లో మెలోడీ గీతం బాగుంది. ‘ఇజం.. ఇజం’ అంటూ పూరి పాడిన పాట ఆకట్టుకునేలా ఉంటుంది. తెల్లదొరలు మనదేశ సంపదను దోచుకుంటే.. ప్రస్తుతం మనదేశ నల్ల కుబేరులు దేశ సంపదను నల్ల ధనం ద్వారా దోచేసుకుంటూ దేశాన్ని దారిద్ర్య దేశంగా మార్చేస్తున్నారని.. అందుకు పరిష్కారం కావాలంటే.. నల్లధనాన్ని విదేశాల నుంచి తెప్పించి.. స్వదేశంలోని రైతులకు పంచి పెట్టాలనే పాయింట్‌ను ఇజం ద్వారా పూరీ హైలైట్ చేశారు.

ప్లస్ పాయింట్స్ :
కల్యాణ్ రామ్ నటన, క్లైమాక్స్
మైనస్.. కథపై మరింత కసరత్తు చేయకపోవడం.
రేటింగ్ : 3.5/5

Category:

Telugu Movies news