c2i_239201695719

అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ ఒకే ప్రశ్న!?
అసలు ఏలియన్స్ ఉన్నారా?
ఉంటే ఎక్కడ ఉంటారు?
ఎలా ఉంటారు?
ఏ రూపంలో ఉంటారు?
అవి మనకంటే తెలివైనవా?
వాటిని.. అవి అనాలా? వారు అనాలా?
ఈ ప్రశ్నలన్నింటికీ నా ఊహాశక్తికి అందిన సమాచారం ద్వారా సమాధానం అందిస్తున్నాను.
ఈ విశ్వం ఎంత పెద్దదిగా ఉంటుందంటే.. మన ఊహకే దాని వైశాల్యం అంతుపట్టదు. మన సౌరకుటుంబాల్లాంటి వేలాది సౌరకుటుంబాలుండే పాలపుంతలో 200ల మిలియన్ల నక్షత్రాలుంటాయి. ఈ పాలపుంతలో కోటాను కోట్ల నక్షత్రాలు గ్రహరాశులుంటాయన్నమాట. ఇంత పెద్ద పాలపుంత ఈ విశ్వంలో ఒక చిన్న నీటిబిందువు లాంటిది.

నా గణితశాస్త్ర మేధస్సుతో ఆలోచిస్తే ఈ విశాల విశ్వంలో ఎక్కడో ఒక దగ్గర ఏలియన్స్ ఉండడం ఖాయం. ఇది నా అభిప్రాయం. అవి ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో నివసించగలవో తెలుసా?.. భగ భగమండే సూర్యుడిపై కూడా తిరగగలిగే శక్తి కలిగి ఉండి ఉండొచ్చు.

మనం ఊహించినట్లు.. సైన్స్ ఫిక్షన్ సినిమాల మాదిరిగా ఏలియన్స్ మనతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయన్న మాటలు కూడా వాస్తవమే అయి ఉండొచ్చు. మన ఊహకి అందనంత పెద్దదైన ఈ విశ్వంలో.. ఇన్ని గ్రహాల్లో వేరే ఏ ఒక్క గ్రహం మీదా జీవం ఉండే అవకాశం లేదా? ఈ విశాల విశ్వంలో జీవరాశి కేవలం భూమిపైన మాత్రమే ఉంటుంది, ఉంది అనుకోవడం ఖచ్చితంగా భ్రమే. ఎందుకంటే.. మనిషి మాత్రమే ఈ సువిశాల ప్రపంచంలో బుద్ధి జీవి కాకపోవచ్చు. మనకు తెలియని ప్రపంచంలో మనలాంటి వారు ఇంకెవరో ఉండే ఉంటారు. వారు తెలివితేటల్లో మనకన్నా మించిన వారై ఉండొచ్చు.
గ్రహాంతర జీవులు పెద్ద పెద్ద అంతరిక్ష నౌకలలో తిరుగుతూ ఉండొచ్చు. వారి గ్రహాల నుంచి తెచ్చుకున్న వనరులను వినియోగిస్తూ అంతరిక్షంలో విహరిస్తూ ఉండొచ్చు. వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఇతర గ్రహాలపై దాడి కూడా చేయొచ్చు. ఏలియన్స్ ఇతర గ్రహాలను ఆక్రమించుకుని అక్కడే కొంతకాలం నివసించడానికి ఆసక్తి కూడా చూపొచ్చు. మనిషి అనవసర ప్రయోగాలతో ఏలియన్స్‌ను రెచ్చగొడితే మన గ్రహాన్ని మనమే అంతం చేసుకున్న వాళ్లమవుతాం.

26-1440584942-23

ఏలియన్స్ నిజంగా ఉంటే…
ఈ అంతులేని అంతరిక్షంపై మనిషికెప్పుడూ ఆసక్తే. ఆ అన్వేషణలో మనిషి అంతరిక్షంలో విహరించాడు. చంద్రుని మీద కాలు పెట్టాడు. ఇప్పుడు అంగారకుని మీద జీవం ఆనవాళ్ల కోసం వెతుకుతున్నాడు. అసలు ఈ ఏలియన్స్ అనే వాళ్లు నిజంగా ఉంటే, వాళ్లకీ మనలా తెలివితేటలు ఉంటే, ఈ విశ్వంలో ఏ జీవులున్నాయో తెలుసుకోవాలన్న ఆసక్తి వారికీ ఉండదా? రోదసీలో ప్రయాణిస్తూ మనని వెతుక్కుంటూ వచ్చే అవకాశం లేదా?

ఈ సౌర మండలంలో మన పక్కనే ఉన్న అంగారక గ్రహానికి గంటకు 5 వేల కిలోమీటర్ల వేగంతో వెళ్లినా అక్కడికి చేరడానికే సుమారు రెండు సంవత్సరాలు పడుతుంది. అయితే మనకు సూర్యుడి తర్వాత అతి దగ్గరగా ఉన్న ఆల్ఫా సెంటారీ నక్షత్రం చుట్టూ ఓ గ్రహంలో జీవం ఉందనుకొంటే, వారు గంటకు పదివేల కిలోమీటర్ల వేగంతో వచ్చినా మన భూమిని చేరడానికి సుమారు 6 లక్షల సంవత్సరాలు పడుతుంది. అక్కడి వారు ఇక్కడికి చేరడం అసాధ్యం, ఫ్లూటో మన సౌరమండలంలోనే ఉంది. అక్కడ జీవజాతి ఉన్నట్లు వారు మానవులు అనే ఏలియన్స్ కోసం వెతుకుతున్నారనుకుందాం. నేడు మనకున్న అత్యంత వేగవంతమైన రాకెట్ల లాంటి వాటిలో వారు మన దగ్గరికి బయలుదేరారనుకుందాం. ఫ్లూటో మనకు సుమారు 500 కోట్ల కి.మీ దూరంలో ఉంది.

వారు గంటకు 50 వేల కి.మీ. వేగంతో వచ్చినా ఇక్కడకు చేరాలంటే పట్టే కాలం సుమారు 12 సంవత్సరాలు. మరి ఇంత కాలం రాకెట్లో ఉండడం సాధ్యమా? వారికి కావాల్సిన ఆహారం, గాలి, నీరు అందించాలంటే వీలయ్యేనా? ఈ ఇబ్బంది వల్లే మనం ఫ్లూటో దగ్గరికి వెళ్లలేదు. వారూ రాలేదు. అలా అని ఫ్లూటో వాసులు ఈ విశ్వంలో మరెక్కడా జీవం లేదని అనలేరు కదా! వారు భూమ్మీద జీవం ఉండే అవకాశం ఉందనే నమ్ముతారు. మనం కూడా అచ్చం ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నాం.
ఏలియన్స్ ఎందుకొస్తారు?
ఈ విశ్వంలో జీవులుండడానికి ఆస్కారముందని చెబుతూనే వారెవరూ మనల్ని చూడడానికి రాలేరననీ, వచ్చిన దాఖలాలూ లేవని అంటున్నారేమిటి.. అనే అనుమానం రావొచ్చు. ఉన్నారన్నది ఎంత నిజమో రాలేరన్నదీ ప్రస్తుతానికి అంతే నిజం.

గ్రహాంతరవాసులు కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చేది మన భూమి మీద నైట్‌హాల్ట్‌కో, సైట్ సీయింగ్‌కో కాదు కదా.. మనం వేరే గ్రహాల మీదకి పరిశోధనలకి వెళ్లినట్టే వాళ్లు కూడా మన భూమ్మీదకి వస్తారు. ఒకవేళ గ్రహాంతరవాసులు అంటూ భూమి మీదకి వచ్చి మనల్ని కలిశారంటే.. అది మానవ జాతికి, భూమ్మీదున్న మొత్తం జీవరాశికే ప్రమాదం అయ్యే అవకాశమే చాలా ఎక్కువ అంటున్నారు. ఈ విషయంలో రెండు భిన్న వాదనలు ఉన్నాయి. అందులో మొదటిది ఎక్స్‌ట్రాటెర్రెస్ట్రియల్ లైఫ్ వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుందన్న వాదన. స్నేహం కోసం పాలపుంతలు, నక్షత్రాలు, గ్రహాలు దాటి ఏలియన్స్ మనకోసం వస్తున్నారని చెబుతారు ఈ కోవకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు. ఇక రెండోది అలజడి పుట్టించేది. మనలో గుబులు రేపేది. అదేంటంటే గగనతలం నుంచి మనల్ని నిశితంగా గమనిస్తున్న విశ్వశక్తులు, ఒక్కసారిగా విరుచుకుపడొచ్చు.

మానవాళి వినాశనం కోసమే గ్రహాంతరవాసులు ఎదురు చూస్తున్నారన్నది రెండో వాదన. ఇందులో ఏది కరెక్ట్? గ్రహాంతరవాసులు మంచివాళ్లా? ప్రాణాలు బలి తీసుకునేవాళ్లా? ఒకటి ఇంత దూరం రాగలిగారు అంటే వాళ్లు సాంకేతిక పరంగా మనకన్నా చాలా అడ్వాన్డ్స్ అయి ఉండాలి. రెండు వాళ్ల గ్రహాల మీద ఉన్న ప్రకృతి సిద్ధమైన సంపద అంతా ఖాళీ చేసేసి, ఇంకా వేరే దగ్గరేమైనా దొరుకుతుందేమో దోచుకుందాం అనుకుని రావొచ్చు. వచ్చి తీసుకుంటామంటే ఎవరూ ఇవ్వరు కదా.. రావడం, వాళ్లకి కావాల్సింది దోచుకోవడం, వెళ్లిపోవడం.. అంతేకానీ.. అన్నేసి కోట్ల కిలోమీటర్ల దూరం శ్రమపడి వచ్చి రాత్రికి రాత్రి సీక్రెట్ రీసెర్చ్ చేసి వెళ్లిపోవడం అనే విషయం అంత నమ్మశక్యం కాదు.
మనం చూడలేని ప్రతి దాన్ని మనం కాదని అనలేం. మనకు వేరే గ్రహవాసులు ఏలియన్స్ అయితే.. మనమూ వాటికీ ఏలియన్స్‌మే.

ఏలియన్స్ ఎక్కడెక్కడ ఉండొచ్చు?
అసలీ భూమ్మీద జీవం ఎలా ఏర్పడింది? ఈ విషయంలోనే రకరకాల సిద్ధాంతాలు, ఊహాగానాలు ఉన్నాయి. ఏది ఏమైనా భూమి అనే ఓ గ్రహం మీద జీవం ఏర్పడినట్లు.. ఇతర గ్రహాల మీద జీవం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. జీవం భూమికే పరిమితం కాదు. దీని గురించి స్టీఫెన్ హాకింగ్ ఏం చెబుతున్నారంటే..

జీవద్రవ్యం.. తద్వారా దేహనిర్మాణం జరగాలంటే అమైనో ఆమ్లాలు కావాలి.. అయితే అమైనో ఆమ్లాలు ఒక్కటిగా కలిస్తే జీవం ఏర్పడుతుందా? ఈ సూత్రంతోనే ఎందరో శాస్త్రవేత్తలు రకరకాల ప్రతిపాదనలు చేశారు. ఈ సిద్ధాంతాల ప్రకారం జలాశయాల్లో విడివిడిగా ఉన్న రసాయనాలు కలిసి అమైనో ఆమ్లాలుగా రూపొందాయి. అవి ఒకదానికొకటి తాకుతూ ఉండేవి. ఏదో ఒకరోజు జీవద్రవ్యం ఏర్పడడానికి అనుకూలత ఏర్పడింది. ఆ క్షణమే ఈ భూమిపై జీవావిర్భావానికి తొలి అడుగు పడింది. తొలిసారి ఏర్పడ్డ ఆ జీవం.. తిరిగి రకరకాల జీవులుగా పరిణతి చెందింది. ఏకకణ జీవులు, బహుకణ జీవులుగా అభివృద్ధి చెందింది. ఇవే తిరిగి వర్గాలుగా, విభాగాలుగా, ఉపవిభాగాలుగా అభివృద్ధి చెందాయి.

అయితే అచ్చు ఇవే పరిస్థితులు ఇతర గ్రహాలపైనా జరిగి ఉండొచ్చని ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఇలాగనో.. ఇంతకంటే గొప్పగానో జరిగే అవకాశం మాత్రం లేకపోలేదు. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు జీవం ఏర్పడడానికి చాలా కారణాలే చెప్పారు. కానీ ఈ భూమిపై జీవం పుట్టడానికి ఇక్కడి పరిస్థితులే కారణం కాదనే మరో వాదన కూడా ఉంది. అది వేరే విషయం. కానీ ఈ సృష్టిలో జీవం అభివృద్ధి చెందడానికి అత్యంత కీలకం మాత్రం నీరే. అదే జీవాభివృద్ధికి ప్రధాన వనరు. మన సౌరమండలంలో రెండు గ్రహాల మధ్య నీటి చెమ్మ ఆవరించి ఉంది. వాటిలో మొదటిది భూమి. రెండోది అరుణ గ్రహం. అందుకే ఈ గ్రహంపై నీటి ఆనవాళ్ల కోసం, జీవ రహస్యాల కోసం అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. నాసా కూడా క్యూరియాసిటీ రోవర్‌ను పంపి పరిశోధనలు చేస్తున్నది.

మార్స్‌కు సరిగ్గా 30 మిలియన్ మైళ్ల దూరంలో జూపిటర్ ఉంది. దీని చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహంపై కూడా జీవం ఉండే అవకాశాలు ఉండొచ్చని ఊహాగానాలు ఉన్నాయి.
హాకింగ్ అంచనాల ప్రకారం ఏలియన్స్ ఒకే గ్రహంపై మాత్రమే లేవు.. ఈ విశాల విశ్వగమనంలో ఎన్నో చోట్ల, ఎన్నో గ్రహాలపై ఉండొచ్చు. ఆయన ఊహ ప్రకారం మరో గ్రహంపై లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ అతి చల్లగా ఉండి మంచుగడ్డలుగా, ద్రవ రూపంలో ఉండొచ్చు. దానితోపాటు ఫాస్పరస్, కార్బన్, సిలికాన్ వంటి కొన్ని మూలకాల నుంచి పుడుతుండొచ్చని ఆయన అభిప్రాయం.

ఏలియన్స్ ఎలా ఉంటారు?
విశ్వంలో మనం ఒంటిరివాళ్లం కాదనీ.. మనకు తోడుగా మరికొంతమంది ఉండొచ్చని విశ్వసించడానికి ఈ చిన్న లాజిక్ చాలు.

మనం చూడలేని ప్రతిదాన్ని మనం కాదని, లేదని అనలేం.. అంటే.. ఈ విశ్వంలో గ్రహాంతరవాసులు ఉన్నారన్నమాట. స్టీఫెన్ హాకింగ్ అన్నట్లు నిజంగానే ఉంటే.. ఎలా ఉంటారు? మనుషుల్లాగే ఉంటారా.. వారికి మరేదైనా రూపం ఉంటుందా? మనలా రక్తమాంసాలుంటాయా? అసలు రక్తమే లేని దేహాలు వారి సొంతమా?

జీవ పరిణామ నియమాలు భూమి మీద అయినా.. ఇతర గ్రహాల మీదైనా ఒకేలా ఉంటాయి. వాటి పరిణామ క్రమంలో పెద్దగా ఉపయోగం లేని అవయవాలు అంతరించిపోవచ్చు. భూమ్మీద జరిగినట్లుగానే కాలానుగుణ భౌతిక, రసాయనిక మార్పులు సంభవించి ఉంటే అక్కడ కూడా ఇదే పరిణామం జరుగుతుంది. ఏ రెండు విశ్వపదార్థాలూ స్థల కాల చట్రంలో ఒకే తీరుగా ఉండవు కాబట్టి భూమ్మీద ఉన్న జీవజాతులకూ ఇతర గ్రహాల మీద ఏర్పడ్డ జీవజాతుల స్వరూప స్వభావాలకూ స్వల్పంగానో, అధికంగానే తేడాలుండొచ్చు. అవి అమీబాలాంటి ఏకకణ జీవులు అయి ఉండొచ్చు. డైనోసార్ లాంటి మెగా సైజ్ జీవులూ అయి ఉండొచ్చు.

Category:

Interesting news